Biography

కళ ఎంతో గొప్పది. కళాకారుడు ఇంకా గొప్పవాడు. రెండింటి కన్నా ఆ కళాకారుని ఆదరించి కళను ఆస్వాదించే ప్రేక్షకుడు మరింత గొప్పవాడు. ఈ ఆర్యోక్తిని స్ఫూర్తిగా తీసుకుని తాము నమ్ముకున్న కళకే జీవితాన్ని అంకితం చేసిన ఎందరో మహనుభావులలో శ్రీ సంపత్ కుమార్ గారు ఒకరు.


శ్రీ దాసరి యతిరాజ సంపత్ కుమార్ గారు నవంబర్ 20, 1927లో శ్రీ రామానుజులు గారు, శ్రీమతి రంగనాయకమ్మ గారికి 7వ సంతానంగా, కళలకు కాణాచి అయిన విజయనగరంలో జన్మించారు. 1940వ దశకంలో విజయనగరంలో జరిగిన శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో బి. ఆర్. మోహన్ గారి నృత్య ప్రదర్శనను చూసి స్ఫూర్తిచెంది, మహారాజ సంగీత నృత్య కళాశాలలో నాట్యాచార్యులు అయిన శ్రీ దువ్వూరి జగన్నాథశర్మగారి వద్ద తన నాట్యాభ్యాసానికి నాంది పలికారు శ్రీ సంపత్ కుమార్. కొంతకాలం శ్రీ పేరి నరసింహ శాస్త్రిగారి వద్ద వీణాభ్యాసం కూడా చేసారు. వీరి వద్ద శిష్యరికం చేస్తూనే బి. ఆర్. మోహన్ గారి బృందంతో కలసి ప్రదర్శనలు కూడా ఇస్తూ ఉండేవారు.


తన 19వ ఏట తన మేనమామగారి కుమార్తె అయిన నాగులకొండ నరసాయమ్మగారితో వివాహానంతరం, తన కళాతృష్ణను తీర్చుకోవడానికి చెన్నపట్నంకు బయలుదేరి వెళ్లారు. సుమారు 7 సంవత్సరాలపాటు శ్రీ వెంపటి పెదసత్యంగారు, శ్రీ పసుమర్తి కృష్ణమూర్తిగారు, శ్రీ వేదాంతం ప్రహ్లాదశర్మగారు మొదలగువారి వద్ద నాట్యకళలోని మెళుకువలు నేర్చుకుంటూ ఒక పక్క నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఇంకొకపక్క కొన్ని చలన చిత్రాలలో కూడా నటించారు.


1950వ దశకం పూర్వార్ధంలో శ్రీమతి పి. సుశీల, శ్రీ వీటూరి, శ్రీ మోదుకూరి జాన్సన్, నటి రాజసులోచన, గాయని రమోలా, శ్రీమతి సరోజ శ్రీశ్రీ, రచయిత్రి శ్రీమతి కె. రామలక్ష్మి మొదలగు ప్రముఖులతో కలసి మద్రాసులో "గీతాంజలి - నృత్యాంజలి" అనే సంస్థను స్థాపించి ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

1955లో తిరిగి విజయనగరం చేరుకున్న శ్రీ సంపత్ కుమార్ గారు, అప్పటి మాన్సాస్ కార్యదర్శి అయిన శ్రీ పి. ఎల్. ఎన్. రాజుగారు సంస్థాపక అధ్యక్షులుగా "శ్రీ గీతా నృత్య కళాశాల" అను సంస్థకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ ద్వారా అనేక శిష్యరత్నాలను తయారు చేసి నృత్య ప్రదర్శనాంశాలలో ఒక కొత్త పంథాను ఎంచుకుని, అప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్న పౌరాణికాంశాలతో పాటుగా చారిత్రక, సామజిక అంశాలను కూడా ఎన్నుకుని వినూత్నమైన నృత్య రూపకాలను తయారుచేసి దేశంలోని పలు రాష్ట్రాలలోనే కాక విదేశాలలో కూడా అనేక ప్రదర్శనలిచ్చారు.


శ్రీ సంపత్ కుమార్ గారు మద్రాసులో ఉన్న కాలంలోనే ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు అయిన శ్రీ గరికిపాటి రాజారావుగారితో వీరికి సాన్నిహిత్యం ఏర్పడింది. 1958 లో అప్పటి ఉపరాష్ట్రపతి అయిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణగారి ఆధ్వర్యంలో, ఢిల్లీలో జరగనున్న"అంతర్జాతీయ సాంస్కృతిక ప్రదర్శన" నిమిత్తం ఔత్సాహిక కళాకారులను ఎంపికచేసే పనిలో , శ్రీ రాజారావుగారు ఆంధ్రరాష్ట్రం అంతటా పర్యటిస్తూ విజయనగరం రావడం తటస్థించింది. ఆ సందర్భంగా సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో గీతా నృత్య కళాశాల వారి నృత్యప్రదర్శన చూసి ముగ్ధులైన శ్రీ రాజారావుగారు, ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ ప్రదర్శనలో పాల్గొనడానికి అవకాశాన్ని ఖరారు చేస్తూ, సామాజిక స్పృహ ఉన్న నృత్యరూపకాన్ని ఎంచుకొనవలసిందిగా తెలిపారు.


శ్రీ సంపత్ కుమార్ గారు సరైన సామజిక స్పృహ కలిగిన అంశం గురించి అన్వేషిస్తున్న సమయంలో, గీతా నృత్య కళాశాల ఉపాధ్యక్షులు మరియు మహారాజ కళాశాల ప్రధానాచార్యులు అయిన శ్రీ వసంతరావు వేంకటరావుగారు, శ్రీమతి సరోజినీనాయుడు రచించిన ''కోరమాండల్ ఫిషర్స్" అనే ఆంగ్ల కవితను వీరి దృష్టికి తేవడం జరిగింది. ఇదే తర్వాత కాలంలో "ఆంధ్రజాలరి " అవతరించడానికి పడిన మొదటి బీజం. ఆ రోజుల్లో సంపత్ కుమార్ గారు వ్యాపార నిమిత్తం తరచు భీమునిపట్నం వెళ్తూ ఉండేవారు. అలా యాదృచ్చికంగా అక్కడి జాలరుల జీవిత విధానం ఆతని దృష్టిని ఆకర్షించింది. వారి జీవనశైలిని తరచూ నిశితంగా పరిశీలిస్తూ ఉండేవారు. సంస్థ సభ్యుల ఆమోదంతో అదే ఇతివృత్తంగా తీసుకుంటూ 'కోరమాండల్ ఫిషర్స్' కవిత ఆధారంగా రాబోవు సంచలనం - 'ఆంధ్రజాలరి' అయన మనసులో రూపు దిద్దుకున్నాడు. ఉత్తరాంధ్ర జిల్లాలలో ప్రముఖులైన శ్రీ తబలా రాజుగారి సంగీత సారధ్యంలో, కేవలం తబలా వాద్యధ్వని మాత్రమే ఉండేలా ఈ ఆంధ్రజాలరి నృత్యాన్ని తయారుచేసారు. గీత నృత్య కళాశాల సాంకేతిక నిపుణులైన శ్రీ హీరాసింగ్ గారి లైటింగ్ ఎఫెక్ట్లు తబలాతో కలిసి సముద్రపు అనుభూతిని కలుగజేయడానికి తోడ్పడ్డాయి. ఈవిధంగా ప్రాణంపోసుకున్న "ఆంధ్రజాలరి" నృత్యరూపకం మొదటిసారిగా ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ప్రదర్శించబడి అనేక మన్ననలనందుకుంది.


1962లో ఉజ్జయినిలో "కాళిదాస్ సమారోహ్" పేరుతో జాతీయ స్థాయిలో సంస్కృత నాటక పోటీలు జరిగాయి. శ్రీ సంపత్ కుమార్ గారు తన గురువైన శ్రీ పేరి నరసింహ శాస్త్రి గారితో చర్చించి విజయనగరం సంస్కృత కళాశాల అధ్యాపకులను, విద్యార్థులను కలువుకొని కాళిదాస విరచిత "అభిజ్ఞాన శాకుంతలం" కావ్యాన్ని నృత్య నాటికగా రూపొందించి ఆంధ్ర రాష్ట్రం తరఫున ఉజ్జయిని పోటీలలో పాల్గొన్నారు. ఆ నాటికలో కణ్వమహర్షిగా శ్రీ పేరి నరసింహశాస్త్రి గారు నటించగా దుశ్యంతునకు అంగుళీకము చూపే జాలరివాని పాత్రను సంపత్ కుమార్ గారు పోషించారు. ఆ ప్రదర్శనకు విచ్చేసిన భారత రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణగారు ప్రదర్శన అనంతరం మొదటి బహుమతిగా సువర్ణ కలశాన్ని విజయనగరం గీతా నృత్య కళాశాలకు అందించి, సంపత్ కుమార్ గారి ప్రతిభను మెచ్చుకుని. వారికి "ఆంద్ర జాలరి"గా నామకరణం చేసారు. అదే సంవత్సరం ఈ రూపకాన్ని హైద్రాబాదు రవీంద్రభారతిలో పండిట్ జవహర్లాల్ నెహ్రు గారి సమక్షంలో కూడా ప్రదర్శించారు. ఆనాటి నుండి సంపత్ కుమార్ గారు తన విజయ పరంపరలో ఏనాడూ వెనకకు తిరిగి చూడలేదు. కళారాధనలో ఏనాడూ రాజీ పడలేదు. నృత్య దర్శకత్వంలో తనదైన పంథాను ఏర్పరుకుని ఎన్నో నృత్యరూపకాలకు జీవం పోశారు. 1963లో కలకత్తాలో శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలపై జరిగిన పోటీలలో విజయనగరంనుండి గీతా నృత్య కళాశాల ఆధ్వర్య లో పాల్గొని, రవీంద్రుడు రచించిన "కాబూలీవాలా" ను తెలుగులో నృత్యరూపకంగా మలచి , కాబూలీవాలా పాత్రని తానే పోషించి ప్రధమ బహుమతి అందుకున్నారు. ఇదే పరంపరలో మేనకావిశ్వామిత్ర, మహిషాసురమర్ధిని, శివపార్వతి మొదలగు నృత్యరూపకాలు రూపొందించి దేశవ్యాప్తంగా పలు ప్రదర్శనలిచ్చారు. 1969లో వ్యాపారనిమిత్తం పిఠాపురం వెళ్లిన సంపత్ కుమార్ గారు అక్కడ శ్రీ రంగనాయకులు శ్రీమతి జగదీశ్వరి దంపతుల ప్రధమ పుత్రిక అయినా ఉమామహేశ్వరి గారిని ద్వితీయ వివాహం చేసుకుని విజయనగరం తీసుకుని వచ్చారు. ఆమెకు కూడా స్వతఃసిద్ధంగా నాట్యకళపై మక్కువ ఉండుటవలన ఆమెకు స్వయంగా శిక్షణ ఇచ్చుటయే కాక శ్రీ వేదాంతం ప్రహ్లాదశర్మ గారు, శ్రీ వెంపటి చినసత్యం గారు , శ్రీ సి రామ్మూర్తి గారు, శ్రీమతి ఉమారామారావు గారు వద్ద కూడా శిక్షణ ఇప్పించారు. సంపత్ కుమార్ గారి నైపుణ్యానికి శ్రీమతి ఉమా సంపత్ గారి నాట్య లావణ్యం తోడైయ్యింది. ఇరువురు కలసి కన్నులపండుగగా ఇచ్చిన ప్రదర్శనలకు ప్రజలలో మంచి ఆదరణ లభించింది. దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలిస్తూ నటరాజ సేవలో లీనమయ్యారు ఈ పుణ్య దంపతులు.


యక్షగాన సంప్రదాయంలో "క్షీరసాగరమధనం", ఒరియా భాషలో కాళిదాసు "మేఘసందేశం", అప్పటి వైజాగ్ మేయర్ శ్రీ ఎం ఎస్ రెడ్డిగారి రచన " ఈర్ష్య", కాళిదాస విరచిత " కుమారసంభవం", నాటి గవర్నర్ కుముద్బిన్ జోషి రచించిన "చంపక" అనే బౌద్ధ నృత్య రూపకం మొదలగునవి వీరి ప్రదర్శనలలో ని కొన్ని ఆణిముత్యాలు. 1960వ దశకంలో శ్రీశ్రీ గారు రచించిన మహాప్రస్థానంలోని "ప్రతిజ్ఞ" అనే గేయం సంపత్ కుమార్ గారిని ఆకర్షించింది. అప్పటికే 'ప్రజానాట్య మండలి' సభ్యులుగా ఉన్న సంపత్ కుమార్ గారు ఈ గేయ స్పూర్తితో ఒక నృత్యరూపకాన్ని రూపందించాలని సంకల్పించి, గీతనృత్య కళాశాల సంగీత దర్శకులు శ్రీ నెల్లూరి వెంకటరావుగారి సంగీత దర్శకత్వంలో "విప్లవశంఖం" అనే నృత్యరూపకాన్ని తయారుచేసి ప్రదర్శించారు. సాహిత్యపరంగా, సంగీతపరంగా కూడా ఈ నృత్యరూపకం ఒక సంచలనం సృష్టించింది. పండితులని, పామరులను కూడా మెప్పించింది. ఈ నృత్యరూపకాన్ని తర్వాతికాలంలో మద్రాసులో శ్రీ శ్రీ గారి సమక్షంలో ప్రదర్శింపగా, శ్రీ శ్రీ గారు ఎంతో ఆనందించి, తాను కానని భావాలను కూడా సంపత్ కుమార్ తన నృత్యరూపకం ద్వారా ఆవిష్కరించారని మెచ్చుకున్నారు.


1973లో శ్రీ సంపత్ కుమార్ గారు బెర్లిన్ లో జరిగిన ప్రపంచ సాంస్కృతిక సభలలో పాల్గొని, ఆంధ్రజాలరి నృత్యానికి అంతర్జాతీయయ స్థాయిలో ఖ్యాతిని ఇనుమడింపజేశారు. 1974లో సోవియెట్ రష్యా ఆహ్వానంపై శ్రీమత్ ఉమా సంపత్ గారితో కలసి ఆఫ్గనిస్తాన్ లోని కాబుల్, తాష్కంట్, మాస్కో, కీవ్, లైనిండ్రడ్, ఉజ్బెకిస్థాన్ మొదలగు ప్రదేశాలలో పర్యటించి ప్రదర్శనలిచ్చారు. 1985లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు శ్రీ సునీల్ గవాస్కర్, శ్రీ దాసరి నారాయణరావు, శ్రీ రామోజీరావులతో పాటుగా శ్రీ సంపత్ కుమార్ గారికి కూడా "కళాప్రపూర్ణ" గౌరవ డాక్టరేట్ ను బహుకరించారు. 1990లో మారిషస్ దేశంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో సంపత్ కుమార్ గారికి ఘన సత్కారం జరిగింది.


1993లో అమెరికాలో న్యూయార్క్ నగరంలో జరిగిన తెలుగు మహాసభల సందర్భంగా శ్రీ సంపత్ కుమార్ గారు తన నాట్యబృందంతో సహా వెళ్లి అమెరికా దేశంలో పలు రాష్ట్రాలలో అనేక ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. వయసు, అనారోగ్య సమస్యలను కూడ లెక్కచేయకుండా క్రమశిక్షణ వ్యాయాయములతో తన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ తన నాట్యయోగ సాధనను ముందుకు నడిపించారు. 1995లో కె. విశ్వనాధ్ గారి దర్శకత్వంలో విడుదల అయిన 'శుభసంకల్పం' చలన చిత్రంలో శ్రీ కమల్ హాసన్ గారికి నృత్యదర్శకత్వం వహిస్తూ, తాను సృష్టించిన ఆంధ్రజాలరిని మొదటిసారిగా వెండితెరపై చిత్రీకరింపజేశారు. 1977లో తన 70వ ఏట కోరుకొండ సైనిక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రజాలరి నృత్యాన్ని కడసారిగా ప్రదర్శించారు. వృధాప్యంలో కూడా తన శిష్యులకు నాట్యశిక్షణ ఇస్తూ నటరాజ సన్నిధిలోనే శేషజీవితాన్ని గడిపారు. 1999 మే 21న గుండెపోటు వలన వారు నటరాజులో లీనమైనా, నాటికి నేటికీ ఎన్నటికీ విజయనగరం గర్వించదగ్గ నాట్యాచార్యులు శ్రీ సంపత్ కుమార్ గారు. అసంఖ్యాకమైన వారి శిష్యుల ద్వారా నేటికీ కూడా వారి నాట్యశైలి ఈ తరం వారికీ అందజేయబడుతోంది.

సంకలనం : Radhika Mangipudi